మేషరాశి
నక్షత్రాలువార్షిక ఫలితం
ఈ రాశి వారికి సంవత్సరాది నుండి జూన్ 1 వరకు గురుడు తృతీయస్థానంలో రజితమూర్తిగా, అక్టోబర్ 31 వరకు చతుర్థస్థానంలో రజితమూర్తిగా, జనవరి 24 వరకు పంచమస్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తాడు. సంవత్సరాంతం వరకు చతుర్థస్థానంలో రజితమూర్తిగా ఉంటాడు. శని సంవత్సరమంతా వ్యయస్థానంలో లోహమూర్తిగా సంచరిస్తాడు. రాహువు లాభస్థానంలో, కేతువు పంచమస్థానంలో డిసెంబర్ 5 వరకు తామ్రమూర్తులుగా ఉంటారు. అనంతరం రాహువు రాజ్యస్థానంలో, కేతువు చతుర్థస్థానంలో తామ్రమూర్తులుగా సంచరిస్తారు.
సంవత్సర ప్రారంభంలో అధిక శ్రమ, ఓర్పు, నేర్పుతో పనులు నిర్వహిస్తారు. శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి మాత్రమే అమలు చేస్తారు. సమాజంలో తమ ఉన్నతి మరియు కుటుంబ అభివృద్ధి కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. కొన్ని సందర్భాలలో అప్పులు చేసి మరీ విలాసవంతమైన జీవన విధానాన్ని కొనసాగిస్తారు. మీ ఎదుగుదలను చూసి బంధువులలో ఈర్ష్య, అసూయ కలగవచ్చు.
ఉద్యోగ పరంగా కొంత ప్రతిబంధకాలు ఎదురైనా వాటిని ధైర్యంగా అధిగమిస్తారు. జూన్ నెలలో స్థాన మార్పు లేదా ప్రమోషన్ అవకాశాలు కనిపిస్తాయి. కనిష్ఠ సోదరుల అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వారి సహకారం కూడా లభిస్తుంది. పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీకు ఇష్టమైన వారితో కొంత దూరం లేదా విభేదాలు ఏర్పడే అవకాశముంది.
నూతన వస్త్రాలు, ఆభరణాలు, విలాసవంతమైన వాహనాలు సమకూరుతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగుతారు. వ్యాపారవేత్తలు ధైర్యసాహసాలతో వ్యాపార విస్తరణకు మరియు పెట్టుబడుల పెంపుకు ప్రయత్నిస్తారు. సంవత్సర మధ్యకాలం నుండి అధికార సహాయం మరియు మార్కెట్ లాభాలు కలసివస్తాయి.
విద్యార్థులు ఉన్నత విద్య మరియు విదేశీ విద్య కోసం ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. జూన్ తర్వాత అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. వ్యవసాయదారులకు మొదటి పంట సాధారణంగా ఉండగా రెండవ పంట అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు తరచూ ప్రయాణాలు కొంత అసౌకర్యం కలిగించినా భవిష్యత్తులో ప్రయోజనకరంగా మారతాయి.
రచయితలు, ఉపన్యాసకులు, కళాకారులకు అనుకూల సమయం. సాంకేతిక నిపుణులు, వైద్యులకు ప్రభుత్వ గుర్తింపు మరియు ప్రోత్సాహం లభిస్తుంది. సినీ మరియు మీడియా రంగాలకు చెందినవారు ప్రారంభంలో కొంత ఒత్తిడి ఎదుర్కొన్నా సంవత్సరాంతానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.
శ్రామిక వర్గాలకు మిత్రభేదాలు, చిన్న చిన్న కలహాలు సంభవించినా త్వరలోనే సర్దుబాటు అవుతాయి. ఆర్థిక లాభాలు లభిస్తాయి. ఈ రాశివారు ఈశ్వరారాధన, శని స్తోత్ర పారాయణం, తైలాభిషేకం, దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయడం, గురు మరియు శని గ్రహ శాంతులు నిర్వహించడం శ్రేయస్కరం.
నెలవారీ ఫలాలు
ప్రతి నెల ఫలితం
ఏప్రిల్
శ్రమ, చికాకులు ఉన్నప్పటికీ మిత్ర సహాయం, అధికార అండదండలతో ముందుకు సాగగలరు. కార్యసాధన జరుగుతుంది. అప్పుడప్పుడు వివాదాలు ఎదురవుతాయి. జాగ్రత్త అవసరం.
మే
దూర ప్రయాణాల వలన ఇబ్బందులు, అధికార చికాకులు, వృత్తి ఉద్యోగాల్లో గౌరవ ప్రతిష్ఠలు, పట్టుదలతో కార్యసాధన, శత్రుజయం, బంధు మిత్ర సమాదరణ, కుటుంబ సుఖ సంతోషాలు కలుగుతాయి.
జూన్
శారీరక మరియు కుటుంబ అనారోగ్య సమస్యలు, ఆప్తవియోగం, శ్రమ, చికాకులతో అశాంతి. దూర ప్రయాణాల వలన అసౌకర్యాలు. అధికార మరియు అనధికార వర్గాలతో చిక్కులు ఏర్పడవచ్చు.
జూలై
స్త్రీ సహాయం, అధికార అనుగ్రహం, కుటుంబ సౌఖ్యం, సంఘ గౌరవాలు, నూతన ప్రయత్నాలు, బుణ విమోచనం, సన్మానాలు, స్వల్ప శ్రమతో కార్యసాధన.
ఆగస్టు
స్వయం సమృద్ధి, ఆర్థిక స్వావలంబన, కుటుంబ సభ్యుల సహకారం, బంధుమిత్రులతో సాన్నిహిత్యం, వినోద కార్యక్రమాలు, భూ గృహ సాఫల్యం.
సెప్టెంబర్
వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత, శ్రమచే కార్యసాధన, అధికారుల వలన ఇబ్బందులు, కుటుంబ సుఖ సంతోషాలు, అసూయాపరుల వలన ఇబ్బందులు, అప్పుల ఒత్తిడి.
అక్టోబర్
ఆత్మస్థైర్యం, ధైర్యసాహసాలు, వృత్తిలో అభివృద్ధి, అధికార సహకారంతో కార్యసిద్ధి, బంధుమిత్ర సమాగమం, వినోదం, నష్టద్రవ్య ప్రాప్తి.
నవంబర్
బంధుమిత్రుల సహాయం, అధికార అనుగ్రహం, కుటుంబ సౌఖ్యం, పితృసంబంధ వ్యవహారాల్లో అనుకూలత, లాభాలు, బుణ విముక్తి, వస్తు సంపాదన.
డిసెంబర్
కుటుంబ సుఖ సంతోషాలు, వ్యవహారాల్లో చురుకుదనం, సంఘ గౌరవాలు, వాహన సౌఖ్యం, దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.
జనవరి
అధికార పరమైన నిరాదరణ, చిక్కులు, అప్పుల ఒత్తిడి, అపవాదులు, నిరాశ, వృత్తిలో ఇబ్బందులు, ఇతర వ్యవహారాల్లో మోసపోయే అవకాశాలు.
ఫిబ్రవరి
వినోద కార్యక్రమాల వలన ఖర్చులు, కుటుంబ సుఖ సంతోషాలు, భూ గృహ విషయాల్లో అనుకూలత, అధికార అనుగ్రహం, సంఘ గౌరవాలు, మైత్రి లాభాలు.
మార్చి
కళత్ర సంబంధ చికాకులు, మిత్ర సహాయం ఉన్నప్పటికీ బంధువుల నిరాదరణ, వివాదాలు, అధిక ఖర్చులు, అనాలోచిత నిర్ణయాల వలన ఇబ్బందులు.